నలుపే అందం
ʹʹనిన్ను ఎవరో తిరస్కరించడం కాదు... నిన్ను నీవు ప్రేమించుకోలేకపోవడమే అసలైన తిరస్కారం ʹʹ
అవును అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. కానీ అసలైన అందం ఏది? వాటీజ్ బ్యూటీ అంటే వైటీజ్ బ్యూటీ అన్న విధంగా అయిపోయింది. నలుపుగా ఉంటే చిన్నచూపు... భారత సమాజంలో వేళ్లూనుకుపోయిన ఈ భావజాలం అంతకంతకూ రెట్టింపు అవుతోంది. కాస్మొటిక్స్ మార్కెట్‌ను పెంచి పోషిస్తోంది. అదే మార్కెట్ ప్రకటనల మాయాజాలంలో పడుతున్న అమ్మాయిలు ʹతెలుపుʹ జపం చేస్తున్నారు. అయితే అందంగా ఉండటం అంటే ఆత్మవిశ్వాసంతోఉండటం, నలుగురిని ప్రేమించే మంచి మనసు ఉండటం. అందం అంటే తెలుపు కాదు. నలుపులోనే అసలైన అందం ఉంది!
తెలుపే అందం అన్న భావజాలం భారత సమాజంలో వేళ్లూనుకు పోయింది. బిడ్డ పుట్టినప్పటినుంచే ఈ తేడా కనబరుస్తుంది. అమ్మాయి పుట్టిందనగానే అమ్మ పోలికా? నాన్న పోలికా? తెల్లగా ఉందా? నల్లగా ఉందా? ఎవరి పోలికో అడగడం అంటే ఏమో అనుకోవచ్చు. పుట్టీ పుట్టగానే నలుపో, తెలుపో తెలుసుకోవాలన్న ఆతృత ఎందుకు? నల్లగా ఉంటే బిడ్డను పారేస్తామా? పారేయం.. కానీ అక్కడినుంచే ఆ బిడ్డపై ప్రేమ పేరుతో ఓ మార్కెట్ భావజాలాన్ని రుద్దేస్తున్నాం. తెల్లగా కావడానికి సబ్బులు, బాడీ లోషన్స్. తల్లిదండ్రులు పట్టించుకోకపోతే చూసిన ప్రతి ఒక్కరు. అరే పిల్ల నల్లగా అయిపోతోందే... అది వాడు ఇది వాడు అంటూ సలహాలు, సూచనలు. మార్కెట్ మనుషుల ఆలోచనలను ఎంతగా నియంత్రిస్తుందో వీటినిబట్టే తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టిన అమ్మాయి తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే ʹతెలుపుʹ అందం మీద స్పృహ పెంచుకుంటోంది.
ప్రకటనల మాయాజాలం...
ఇటీవలే టీవీలో ఎక్కువగా కనిపిస్తున్న ప్రకటన ʹమ్యాగీ - రాజకుమారిʹ యాడ్. నల్లగా ఉన్న ఆ అమ్మాయి రాజకుమారి అని పేరు పెట్టుకోవడమే నేరంగా చూస్తుంటారు ఫ్రెండ్స్. ʹరాజకుమారి రాజకుమారిʹ అని ఏడిపిస్తుంటారు. ఇంట్లో నిజంగానే రాజకుమారి అయిన ఆ అమ్మాయి తల్లిపై అలిగి కూర్చుంటుంది ʹకొన్ని వేల పేర్లు ఉండగా.. నీకు ఇదే పేరు దొరికిందా నాకు పెట్టడానికిʹ అని. అందుకు తల్లి ʹఎన్నో వేల పేర్లు ఉన్నా... నాకెంతో స్పెషల్ అయిన నా కూతురు నాకెప్పుడూ రాజకుమారినేʹ అంటుంది తల్లి. నిజమే తల్లిదండ్రులకు కూతురెప్పుడూ రాజకుమారినే. మరి రాజకుమారిని ఎలాంటి భావజాలంతో పెంచుతున్నామన్నది ముఖ్యం. ʹమ్యాగీ-రాజకుమారిʹ ఒకటి అరా యాడ్స్ తప్ప అన్నీ.. అందానికి ఎన్నో అబద్ధపు నిర్వచనాలు చెప్పేవే. అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయి. అందంగా ఉంటేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పటిదాకా ఎవడో ఒకడు వచ్చినవాడితో పెళ్లి చేసుకుందామనుకున్న అమ్మాయి ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్ రాసుకోగానే.. ʹʹమంచి ఉద్యోగం, మంచి ఇల్లు సంపాదించుకున్నాకే పెళ్లిʹʹ అనేంత స్థాయికి ఎదుగుతుంది. చివరకు అందంగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి అనే స్థాయికి దిగజారాయి. వారి బ్రాండ్స్ వాడితే నడి వయసు మహిళలు సైతం కాలేజ్ అమ్మాయిలైపోతారు, వయసు తగ్గిపోయి చిన్నపిల్లల్లా గంతులేస్తారు. ఒకటా రెండా అన్నీ... చిన్నారుల మెదళ్ళలో విషం చిమ్మేవే.
వేళ్లూనుకుపోయిన భావజాలం...
నట్టింట్లో టీవీ తిష్ట వేసి కూర్చున్న తరువాత అందం నిర్వచనమే మారిపోయింది. తెలుపే అందం... సన్నగా స్లిమ్‌గా ఉంటేనే అందం. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్ని మార్గదర్శకాల ప్రకారం... సౌందర్య సాధనాల ప్రచారంలో ఎక్కడా శరీరం రంగు గురించి ప్రస్తావించకూడదు. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ నలుపుదనంతో ఉన్నవారి మనోభావాలని దెబ్బతీయకూడదు. నల్లగా ఉంటే అందంగా లేనట్లని, ఉద్యోగాలు రావని, ప్రేమకు నోచుకోరని, పెళ్లి జరగదని, సమాజంలో చులకనకు గురవుతారని అర్థం వచ్చేలా ప్రకటనలు చేయకూడదు. అయినా తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడానికి ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు రూపొందిస్తూనే ఉన్నాయి. ఇది ఇప్పటిది కాదు.. 1975లో ఫెయిర్‌నెస్ క్రీమ్ మొదలైననాటిదే. ఇప్పుడా ఫెయిర్‌నెస్ క్రీమ్ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. ఆసియాతోపాటు ఆఫ్రికా, మిడిల్‌ఈస్ట్‌కి కూడా దాని ప్రభావం పాకింది.
నగరాల నుంచి గ్రామాల దాకా...
ఆ భావజాలంలోనే పుట్టి పెరుగుతున్న పిల్లలు అందం చుట్టూనే తిరుగుతున్నారు. ఇప్పటికే ఇంటా బయటా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న అమ్మాయిలు అందం పేరుతో ఫెయిర్ స్కిన్ అనే అదనపు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. ఈ అత్మన్యూనత వారి భవిష్యత్‌లో అన్ని విషయాలపైనా చెడు ప్రభావం చూపిస్తుంది. పిల్లల్లో సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతోంది. అందరికంటే తాము తక్కువ అనే భావంతో... అమ్మాయిలు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల నగరాలనుంచి పట్టణాలు, చిన్న పట్టణాల వరకు విస్తరించిన బ్యూటీ పార్లర్లను చూస్తే అర్థమవుతుంది అందం పట్ల స్పృహ ఎంత పెరిగిందో. ఇక నగరాల గురించి చెప్పక్కర్లేదు. హైదరాబాద్‌లో అయితే గల్లీకో పార్లర్ ప్రత్యక్షమవుతుంది. ఇవి చాలు.. అందంపై స్పృహ ఎంత పెరిగిందనడానికి. అందంగా కనిపించాలనుకోవడం వరకు పెరిగితే ఓకే.. అయితే తెలుపే అందం అనేదగ్గరే అసలు చిక్కు. ఈ అందం స్పృహ ఇటీవల అబ్బాయిల్లోనూ పెరిగిపోయింది. అందుకే జెంట్స్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వచ్చాయి. గత ఏడాది మార్కెట్‌లో అమ్ముడు పోయిన ఫేషియల్ మాయిశ్చరైజర్స్‌లో 80 శాతం మార్కెట్ స్కిన్ లైటెనింగ్ క్రీములదే. దీన్ని బట్టే అర్థమవుతుంది చర్మాన్ని తెల్లగా మార్చే క్రీములు ఎంత నిత్యావసర వస్తువుగా మారిపోయాయో. అమ్మాయిల్లోనే కాదు... తల్లిదండ్రుల మనసుల్లోనూ ఈ భావజాలం నాటుకుపోయింది.
డార్క్ ఈజ్ బ్యూటిఫుల్
ఈ అవగాహనా రాహిత్యాన్ని పోగొట్టడానికి 2009లో ʹవిమెన్ ఆఫ్ వర్త్ʹ అనే సంస్థ డార్క్ ఈజ్ బ్యూటీఫుల్ అనే క్యాంపెయిన్‌ను మొదలుపెట్టింది. ఇది నల్లగా ఉండటం నేరం కాదు... నలుపులోని అందముంది.. అని సెలబ్రేట్ చేస్తోంది. దీని వ్యవస్థాకురాలు కవితా ఇమానుయేల్. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. సినీ నటి నందితాదాస్ ఈ క్యాంపెయిన్‌కు మద్దతు పలికారు. ʹరంగును చూసో, కులాన్ని తెలుసుకునో కాకుండా... వ్యక్తిత్వాన్ని బట్టి ఆ వ్యక్తిని గౌరవించాలి. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పై చర్మాన్ని కాకుండా మనిషిలోపల ఉన్న మనస్తత్వాన్ని గౌరవించాలిʹ అనే సందేశాన్నిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టిన కొత్తలో చర్చ అయితే మొదలయ్యింది కానీ.. అది సంచలన వార్తలలోకంలో ఎప్పుడో అడుగున పడిపోయింది.
ఆత్మ విశ్వాసంతో పెంచాలి...
ఇటీవలే హైదరాబాద్ నగరంలో ఈ క్యాంపెయిన్ జరిగింది. ఇందులో పాల్గొన్న అమ్మాయిలు తమ అభిప్రాయాలనిలా పంచుకున్నారు. ʹʹ ప్రతి ఒక్కరిలోనూ ఏదో భయం ఉంటుంది. ఇక నా భయం నన్ను నేను అద్దంలో చూసుకున్న ప్రతిసారీ మొదలయ్యేది. అందుకే ఒక్కోసారి అద్దం చూసుకోవడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. నా పెదవులు, గడ్డం చుట్టూ మీసాలు వచ్చినట్టుగా నల్లగా ఉంటుంది. దాంతో నా ఫ్రెండ్స్ నటాషాకి బదులుగా ముస్టాషా అని పిలిచేవారు. దాంతో నేను ఎందుకు పనికిరానన్న భావం ఉండేది. తెల్లగా ఉన్న అమ్మాయిలను చూసి ఎంత అందంగా ఉన్నారో కదా! అనుకునేదాన్ని. ఇవన్నీ నెమ్మదిగా నామీద నాకే ఇష్టం లేకుండా చేశాయి. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. నిన్ను ఎవరో తిరస్కరించడం కాదు... నిన్ను నీవు ప్రేమించుకోలేకపోవడమే అసలైన తిరస్కారం అని తెలుసుకున్నా. డార్క్ స్కిన్‌తో ఉన్నందుకు నేను గర్వ పడుతున్నా. ఈ దశలో నాకు నా తల్లిదండ్రులు ఎంతో సహాయం చేశారుʹʹ అంటోంది నటాషా. ఇప్పుడు ప్రతి పేరెంట్ చేయాల్సింది కూడా అదే. పిల్లల్ని అందంగా ఉంచడం కాదు.. ఆత్మవిశ్వాసంతో పెరగడమెలాగో నేర్పాలి.
మంచి మనసే అందం...
ʹʹపదేళ్లపాటు నన్ను నేను విమర్శించుకుంటూనే పెరిగా. పొడవుగా ప్రిన్సెస్‌లా పెరిగాను కానీ... నల్లగా ఉండటం శాపం అనుకునేదాన్ని. ప్రతి చోటా వివక్ష ఉండేది. ఇంట్లో కూడా. స్నేహితులు సైతం... తమ పిలుపు ముందు, వెనకా బ్లాక్ అనేది యాడ్ చేసేవాళ్లు. చివరకు బ్లాక్‌గా ఉన్నా నేను అందంగా ఉన్నాను అనే హక్కు కూడా లేకుండా పోయింది నాకు. నా తల్లిదండ్రులు, స్నేహితులు ʹʹనువు బ్లాక్‌గా ఉంటేనేం.. నీదెంత మంచి మనసో కదా!ʹʹ అనేవాళ్లు. అప్పటినుంచే ఎదుటివాళ్లు ఏమనుకుంటున్నారనేది వదిలి... నాకు నేను అందంగా ఉన్నానని ఫీలవ్వడం మొదలుపెట్టానుʹʹ అని చెబుతోంది షిర్లీన్. వాస్తవం అదే... అమ్మాయిలు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా... ఎదుటివారు తమ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేసి... తమ గురించి తాము ఆలోచించుకోవాలి. తమనుతాము ప్రేమించుకోవాలి. అప్పుడే ఈ సమాజాన్ని ప్రేమించగలుగుతారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతారు.
సంస్కారమే అందం...
ʹʹమేం న్యూయార్క్‌లో ఉండేవాళ్లం. ఏవైనా శుభకార్యాలు జరిగితే ఇండియాకు వచ్చేవాళ్లం. ఇలా వచ్చినప్పుడల్లా.. ఒక విషయం నన్ను వెంటాడేది. చుట్టాలను కలిసినప్పుడల్లా ʹఈ ఫెయిర్‌నెస్ క్రీమ్‌వాడు, ఆ ట్రీట్‌మెంట్ చేయించుకోʹ అని సలహాలు ఇచ్చేవాళ్లు. పుట్టుకతో వచ్చిన ఆ రంగు నేరమేంటి? నేను ఎలా ఉన్నానో అలాగే ఎందుకు చూడరు? ఇదే రంగుతో ఉన్నా నన్ను విదేశాల్లో మంచిగా చూశారు. నా సొంతగడ్డపై నన్నెందుకిలా తక్కువగా చూస్తున్నారనుకునేదాన్ని. నల్లగా ఉన్నా అందంగా ఉన్నావు అని ఎవరైనా అంటారేమోనని చూసేదాన్ని. అలా ఎప్పుడూ జరగలేదు. కానీ తెలుపు అందం కాదు.. నల్లగా ఉన్నా.. ఎదుటి వ్యక్తిని గౌరవించగలిగే సంస్కారమే అందంʹʹ అని ధీమాగా చెబుతుంది కీర్తిక గుమ్మడి. నిజమే... పైకి కనిపించే అందం కాదు, ఆ నల్లని చర్మంలోపలి అందమైన మనసును చూడాలి. ధైర్యమున్న వ్యక్తిత్వాన్ని చూడాలి. అదే అసలైన అందమని నిర్వచించాలి.
- కట్ట కవిత
Keywords : black, girl, beauty
(04.10.2017 06:48:42pm)
No. of visitors : 1119
Suggested Posts
Sorry, there are no suggested posts