టీనేజర్స్ - కల్చర్
సంస్కృతి (కల్చర్) అనగానే మనకు సాధారణంగా గుర్తు వచ్చేవి సాలార్జంగ్ మ్యూజియం, రవీంద్ర భారతి, కాకతీయుల కాలం నాటి శిల్ప కళలు మొదలయినవి. ఇవన్ని అద్భుతమయిన మన గత జీవన విధానాన్ని తెలియజేసేవి. కాని టీనేజర్స్-సంస్కృతి అనగానే అవే గుర్తుకు వస్తాయా? లేక మరేమయినానా? ఖచ్చితంగా అవి కావు. కొన్ని భయంకరమయినవి, మరి కొన్ని భాధించేవి. జారి పోయే పాంట్లు, పొట్టి చొక్కాలు, చిరిగిన జీన్స్, టీ షర్ట్స్, సిగరెట్స్, ఆల్కహాల్, పబ్స్, డ్రగ్స్, హింస, అశ్లీల సినిమాలు, అవాన్చిత గర్భాలు, అబార్షన్లు మొదలైనవన్నీ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. ప్రతీ తల్లీ, తండ్రీ లోకమంతా ఎలా ఉన్న తమ పిల్లలు మాత్రం సక్రమంగా ఉన్నారు అని భావిస్తుంటారు. చెడు అలవాట్లకు దూరంగా ఉన్నారని అనుకుంటారు. కాని తీరా సమస్య తమ కుటుంబానికి తాకిన తరువాత మేల్కొంటారు. విపరీతంగా ప్రవర్తిస్తారు. పిల్లల పై విపరీతమయిన వ్యతిరేకత చూపెడతారు. దండిస్తారు. కాని అవి ఏవి పనిచేయవు. మరి కొంత మంది నిస్సహాయంగా ఉండి పోతారు.
ఇది టీనేజర్స్ తప్పు మాత్రమే కాదు. సమాజంలోని ప్రస్తుత సంస్కృతి పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండి, ముందుగా దానిని ఎదుర్కొనే విధంగా సిద్ధం చెయ్యని తల్లిదండ్రులది కూడా. పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలంటే మనం చాల విషయాల గురించి కష్టపడి తెలుసుకోవాలి. కష్టపడి డబ్బు మాత్రమే సంపాదించి ఇస్తే సరిపోదు.
ఇక్కడ ఒక విషయాన్ని మనం మరువకూడదు. అది ఈరోజు కాకుంటే మరో రోజు మీ టీనేజ్ పిల్లలు ఈ సంస్కృతిని ఎదుర్కొనక తప్పదు. ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు వాటి నుండి తప్పించుకొని బ్రతకటం ఎంత వరకు సాధ్యం? అందుకని పిల్లలకు సమయానుగుణంగా ఆ సంస్కృతి ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలో వివరించాలి. నేర్పించాలి. సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సహకరించాలి. అంతే కాని వారిని నిందిచడం సరయినది కాదు. అసలు నేటి సంస్కృతి టీనేజ్ పిల్లలకు ఏమి ఇస్తుందో తల్లిదండ్రులు తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
సంస్కృతి అనగా కొన్ని ఆచరించే పద్ధతులు, నమ్మకాలు. పైకి చెప్పేవి మాత్రమే కాకుండా నిజంగా ఆచరించేవి. అవి లేని వారిని సమాజంలో అరుదయిన, అసాధారణ, లేదా అభివృద్ధి కాని వారిగా చూడబడతారు. మీడియా, సినిమాలు, ప్రకటనలు చూపించేవి మాత్రమే సంస్కృతి అనుకోవటం పొరపాటు. కానీ అవి చాల బలంగా సంస్కృతి మీద ప్రభావం చూపుతాయి. టీవీ, సినిమాలు, వీడియొ గేమ్స్, ప్రకటనలు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఇవన్ని టీనేజ్ లోని పిల్లలకు అందుబాటులో ఉండి వారిని సెక్స్, ఆల్కహాల్, డ్రగ్స్, హింస, అమర్యాద, నిజాయితీ లేకపోవటం వంటి వాటి వైపు నెట్టివేస్తున్నాయి. చాల మంది తల్లిదండ్రులు వాటిని పిల్లలకు అందకుండా చేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కాని అది సాధ్యపడే విషయం కాదు. ఎంత నియంత్రించాలని ప్రయత్నిస్తే పిల్లలు అంతగా దాని పట్ల ఉత్సుకత పెంచుకుంటూ ఉంటారు. స్నేహితుల వద్ద కాని మరెక్కడయినా కాని వాటిని పొందుతారు. మరికొందరు తల్లిదండ్రులు వారి పిల్లలు మాత్రం వీటన్నింటికీ అతీతం అని భావిస్తుంటారు. అది వారి ఇష్టం. అటువంటి వారు ఈ వ్యాసం చదవటం సమయం వృధా చెయ్యడమే అవుతుంది.
ప్రపంచీకరణ వలననో, మరో కారణం వలననో సాధారణ, మధ్యతరగతి ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ఆదాయాలు పెరిగాయి. ఫలితంగా టీనేజ్ పిల్లల కొనుగోలు శక్తి పెరిగింది. ఇది గమనించిన బహుళ జాతి సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వారి ఉత్పత్తులు పెంచుకొనే ప్రయతంలో టీనేజ్ పిల్లలను టార్గెట్ చేసుకుంటున్నాయి. వారిని ప్రభావితం చేసే అంశాల పైన విపరీతంగా ఖర్చు చెయ్యటం ప్రారంభించాయి. వారిని ప్రభావితం చేసే అంశాల పైన రీసెర్చ్ చెయ్యటం జరుగుతోంది. వారిని ప్రభావితం చేసేలాగా ప్రకటనలు తయారు చేయడం, వారిని ప్రభావితం చేయగల మోడల్స్, యాక్టర్స్, ఎంటర్ టైనర్ లను ఉపయోగించు కోవడం చేస్తున్నాయి. ఇందుకు టీనేజ్ పిల్లల ప్రస్తుత కొనుగోలు శక్తి పెరగటం ఒక కారణమయితే, వీరు భవిష్యత్ కొనుగోలు దారుడు కావటం మరొక కారణం.
పూర్వ కాలంలో ఇంతగా కొనుగోలు శక్తి లేనప్పుడు టీనేజ్ పిల్లల దృష్టి కేవలం విలువలు, అభిరుచులు మొదలయిన వాటిపైన మాత్రమే ఉండేది. వాటిగురించి మాత్రమే మాట్లాడుకునేవారు. వాటి గురించి మాత్రమే పోటీ పడేవారు. వాటిని ఆచరించడం గొప్పగా భావించేవారు. కాని నేడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నేడు విలువలు, అభిరుచులు మొదలయిన పదాలు కల్చర్ లేనివాళ్ళు ఉచ్చరించే వాటిగా పరిగణించ బడుతున్నాయి. మీడియా, సినిమా, ప్రకటనలలో ఉన్న విధంగా ఉన్నవారే సమాజానికి తగిన వారు, లేనివారు ఈ సమాజంలో సరిపోరు అని, ఈ సమాజం వీరికి ఒక బలమయిన నమ్మకాన్ని సృష్టించింది.
మరొక ప్రమాదకరమైన అర్థాన్ని ఈ సమాజం నేటి టీనేజ్ యువతకు ఇచ్చింది. ʹవిజయం అనేది మాత్రమే జీవితంʹ. ఎలా సాధించాం అన్నది కాదు ముఖ్యం, ఏమి సాధించామో ముఖ్యం. విజయం కోసం ఏ మార్గాన్నయిన అనుసరించవచ్చు అనే సంస్కృతి బలపడిపోయింది. కార్పోరేట్ స్కూల్స్, కార్పోరేట్ సంస్థలు ఈ సంస్కృతిని మరింత ప్రోతహిస్తున్నాయి. విలువలు తరగతి గదులలో, పుస్తకాలలో నిక్షిప్తమయిన పదం. అది ఆచరించదగినది కాదు అని భావించబడుతున్నది. ప్రస్తుత తల్లిదండ్రుల ప్రవర్తన కూడా దీనికి విరుద్ధంగా లేక పోవటం విచారకరం.
ఇవన్ని టీనేజ్ యువత పైన చాల బలంగా పని చేస్తాయి అనేది నిస్సందేహం. శక్తి వంతమయిన మీడియా, సినిమాలు, పబ్స్, పార్టీలు, కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుతురు, రంగులు, గుండెలు అదిరే మ్యూజిక్, యాంకర్స్, మోడల్స్, తియ్యని మాటలు, న్యూ ఇయర్ పార్టీలు, బర్త్ డే పార్టీలు, వాలంటైన్స్ డే సెలెబ్రేషన్స్. ఇంత బలంగా ఉన్న సమయంలో మీ టీనేజ్ యువత మాత్రమే ఒట్టి చేతులతో ఎదుర్కోవాలనుకోవటం ఎంత వరకు సమంజసం? ఒకవేళ మీ దగ్గర ఎదురోన్నట్లు నటించినా వాటికి లొంగిపోక తప్పని పరిస్థితి.
తల్లిదండ్రులారా భయపడ వద్దు. అప్రమత్తం అవ్వండి. మీ టీనేజ్ యువతను ఈ సమాజంలో ఉన్న రుగ్మతల పద్మవ్యూహం లోకి తోసివేసి మీరు సహాయం చెయ్యలేని పరిస్థితిలో మిగిలిపోవద్దు. వారికి ఆ పద్మవ్యూహం చేధించడం నేర్పించండి, సహకరించండి.
ఇందుకు గాను కొన్ని పాటించవలసిన పద్ధతులను గురించి వివరించడం జరిగింది.
సమాచారం కలిగి ఉండండి:
మీ టీనేజ్ యువతకు ఎటువంటి సమాచారం అందుతుందో వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రస్తుత సంస్కృతి మీద వివిధ పత్రికలలో వచ్చే వ్యాసాలను చదవండి. టీవిలో వచ్చే విశ్లేషణలు వినండి. వారి స్కూల్ టీచర్స్ తో, కౌన్సెలర్స్ తో మాట్లాడండి. మీ సమయం విలువైనదే. కాని మీ పిల్లల కోసం వినియోగించలేని సమయం, సంపాదన వృధా కదా. అతి నమ్మకాలను వదిలి నిర్మాణాత్మకంగా ఆలోచించడి. మీ టీనేజ్ పిల్లల స్నేహితులతో తరచూ మాట్లాడుతూ (ఎంక్వారీ కాదు) ఉండండి. మీ పిల్లలతో సమయం గడపండి. వారు చూసే సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ మీరు కూడా కొన్నింటిని (వారితో కలసి కాదు) చూడండి. వారి మొబైల్ ఫోన్లకు వచ్చే మెస్సేజెస్ గురించి తెలుసుకోండి. అర్థం చేసుకోండి. మీ టీనేజ్ పిల్లలను అప్రమత్తం చెయ్యండి. కోపగించుకోవద్దు. వివరించండి.
శ్రద్ధగా వినండి :
మీ టీనేజ్ పిల్లల దగ్గర అద్భుతమైన సమాచారం ప్రస్తుత సంస్కృతి గురించి ఉంటుంది. దానిని పూర్తిగా మీతో పంచుకోవటానికి వారు ఇష్టపడరు. వారిని అడగండి. మొదట్లో చెప్పటానికి కొంత తటపటాయించినా మీరు వారి పట్ల ప్రేమగా ఉండి వారికి మీపైన నమ్మకం కలిగిన తరువాత వారు మీతో పంచుకుంటారు. మీరు శ్రద్ధగా వినండి. జడ్జ్ చెయ్యవద్దు. "అది తప్పు" అని వెంటనే అనకండి. కేవలం వినండి. వారు చెప్పటం అనే దానిని ప్రోత్సహించండి. మీరు తప్పు అన్న మరు క్షణం వారు మీతో పంచుకోవటం ఆపేస్తారు. ఒక వేళ పంచుకున్నా మీరు వ్యతిరేకించే వాటిని పంచుకోరు. వారికి బాహ్య ప్రపంచం చాల ముఖ్యమైనది. భవిష్యత్తులో వారు ఆ ప్రపంచంలో బ్రతకాలి. కాబట్టి అది మీకంటే ముఖ్యమైనది. కాబట్టి కేవలం వినండి. స్కూల్స్, కాలేజిలలో జరిగే రకరకాల ప్రోగ్రామ్స్ కు తల్లి దండ్రులు ఇరువురు హాజరు అవ్వండి. మీ టీనేజ్ పిల్లలు అక్కడ వారి అనుభవాలను పంచుకుంటారు. వారిని పంచుకోనివ్వండి. వారి స్నేహితులను పరిచయం చేస్తారు. వారిని ప్రేమగా పలకరించండి. అప్పుడప్పుడు వారిని మీ ఇంటికి వచ్చి గడపమని ఆహ్వానించండి. వారు మీ ఇంటికి వచ్చినపుడు వారితో కొంత కాలం గడపండి. స్నేహంగా ఉండండి. కాని మీరే స్నేహితులు కావద్దు. ఏ టీనేజ్ పిల్లలు కూడా వారి తల్లిదండ్రులే వారి స్నేహితులవటం ఇష్టపడరు. పేరెంట్ గా మీ పాత్ర ఒక అద్భుతమైనది. అందులోనే ఉండండి. హుందాగా ప్రవర్తించండి.
సమయం కేటాయించండి :
మీరు ఎంత బిజీ అయినా మీ పిల్లలకు సమయం కేటాయించడం కంటే విలువయినది మరొకటి ఉండదు. ఎవరో ఓకే పేరెంట్ మాత్రం పూర్తి సమయం కేటాయిస్తే సరిపోతుంది అనుకుంటారు. అది సరైన అభిప్రాయం కాదు. రెండవ పేరెంట్ కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. తల్లిదండ్రుల ఇరువురికి పిల్లల పట్ల వేర్వేరు పాత్రలున్నాయి. కాబట్టి ఇద్దరూ సమయం కేటాయించండి. అందరు కలసి భోజనాలు చెయ్యండి. ప్రస్తుత సమాజంలో వచ్చే మార్పుల గురించి చర్చించండి. మార్కుల గురించి కాదు. మీడియా, సినిమాలు, డ్రగ్స్, ఆల్కహాల్, సెక్స్, విలువలు, అన్నీ చర్చించండి. మీరు చర్చించకపోతే వారు సరిగా అవగాహనలేని వారి స్నేహితులతో చర్చిస్తారు. అది మరింత ప్రమాదకరం. మొదట్లో మీ టీనేజ్ పిల్లలు చర్చించడానికి విముఖత చూపినా తరువాత వారు మీతో చర్చిస్తారు. ఇక్కడ మరొక విషయం గమనించాలి. మీరు చర్చించే ముందు ఆ విషయం పట్ల మీకు అవగాన ఉండాలి. అందుకోసం పుస్తకాలు చదవండి, విషయ పరిజ్ఞానం పెంపొందిచుకోండి. హేతుబద్ధత అలవరుచుకోండి. అజ్ఞానంతో చర్చించవద్దు. ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దు. అది వారిని మీ నుండి ఇంకా దూరం చేస్తుంది.
అప్రమత్తంగా ఉండండి :
మీరు మీ కుటుంబ పెద్ద. మీకు కుటుంబంలో జరిగే అన్ని విషయాల గురించి తెలియవలసిన అవసరం ఉంది. మీ టీనేజ్ పిల్లలు ఏ ఛానల్స్ చూస్తున్నారు, ఏ వెబ్ సైట్స్ చూస్తున్నారు, ఎటువంటి మెస్సేజెస్ పంపుతున్నారు, ఎటువంటి మెస్సేజెస్ చదువుతున్నారు, ఏ టైములో ఫోన్ మాట్లాడుతున్నారు వంటి విషయాల పట్ల శ్రద్ధ వహించండి. వారికి ప్రమాదకరం అనుకున్న ఛానల్స్ లాక్ చెయ్యండి. వెబ్ సైట్స్ బ్లాక్ చెయ్యండి. అప్పడప్పుడు వారి కాల్ డేటాను చెక్ చేస్తూ ఉండండి. కాని వారిని నేరస్తులను ప్రశ్నిస్తున్నట్లు ప్రశ్నించ వద్దు.
మీ టీనేజ్ పిల్లల పట్ల అవగాహన కలిగి ఉండండి :
కొందరు పిల్లలు సమాజంలోని చెడు పట్ల సులభంగా ఆకర్షితులవుతారు. కొందరికి సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది. కొందరు ఇంట్రోవేర్ట్స్, మరికొందరు ఎక్ష్త్రొవేర్ట్స్. మీ పిల్లల గురించి, వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోండి. తల్లిదండ్రులుగా మీ పిల్లల పట్ల మీరు ఖచ్చితమయిన అభిప్రాయానికి రావటం కష్టమయిన పని. ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు తమ పిల్లల గురించి చెడుగా ఆలోచించలేరు. కాబట్టి కౌన్సెలర్ లేదా సైకాలజిస్ట్ అభిప్రాయాన్ని తీసుకోండి. వారు రకరకాల టెస్ట్స్ నిర్వహించి మీ పిల్లల గురించి మీకు వివరిస్తారు. పిల్లల స్వభావాన్ని బట్టి మీరు పాటించబోయే పద్ధతులను ఎంచుకోవలసి ఉంటుంది.
వ్యతిరేకంగా స్పందించకండి :
ఏదయినా సమాచారం మీకు తెలిసిన వెంటనే వ్యతిరేకంగా "అది తప్పు/అది వద్దు" అని స్పందించకండి. కొంత ప్రశాంతత కలిగి ఉండండి. వాతావణం సాధారణ స్థితికి వచ్చిన తరువాత వారికి వివరించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం వారి ఎదుగుదలకు ఎంతో అవసరం. దానిని నిరోధించవద్దు. అందులోని చెడుని మాత్రమే వేరు చెయ్యటమే మీ పని.
మంచిని ప్రోత్సహించండి :
వారిలో ఉండే మంచి ప్రవర్తనను అభినందించండి. ప్రోత్సహించండి. చెడును వివరించండి. సాధారణంగా తల్లిదండ్రులు వారి మూడ్ ని బట్టి పిల్లల పట్ల తమ ప్రవర్తన కలిగి ఉంటారు. తాము ఆనందంగా ఉన్నప్పుడు ఒక విధంగా, కోపంలో ఉన్నప్పుడు మరో విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇది ఎంతో ప్రమాదకరం. పిల్లలు మీ మూడ్స్ ని బట్టి వాళ్లకు కావలసినవి మీ నుండి పొందుతుంటారు. కాబట్టి, మీ మూడ్ ని బట్టి కాకుండా వారి ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని వ్యవహరించాలి.
ముగింపు :
ఒక ఉత్తమమైన పౌరునిగా మీ పిల్లలను తీర్చిదిద్దటం కన్నా దేశ సేవ, సమాజ సేవ మరొకటి లేదు. అంతకన్నా గొప్ప సంపాదన మరొకటి లేదు.
- హరి రాఘవ్
Keywords : teens, culture, students, education
(19.10.2017 11:51:39am)
No. of visitors : 1039
Suggested Posts
8 results found !
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?టీనేజ్ పిల్లలో వచ్చే మానసిక శారీరక మార్పులేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలుNRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| పిల్లల పెంపకం - నేటి పరిస్థితులుసృష్టిలో ఏ పేరెంట్స్ కి కూడా తమ బిడ్డలపై ప్రేమ లేకుండా ఉండదు. పురాణ కాలంలో ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్య కశ్యపుని నుండి మొదలు నేటి తరం పేరెంట్స్ వరకు ఎవరూ కూడా తమ బిడ్డలు వృద్ధి లోకి రావాలనే తప్ప చెడిపోవాలి, సమాజానికి హానికరంగా మారాలని కోరుకోరు. కాని వారి వారి పెంపకం లో ఉన్న వైరుధ్యాల వలన బిడ్డలు వివిధ రకాలుగా ఎదిగి తరువాత గొప్ప వారిగా లేదా నేరస్తులుగ |
| వాట్స్-యాప్ మెసేజ్ తో ఒకరి పై ఒకరు కత్తులతో దాడి టీనేజ్ లో ఉన్న యువత తీవ్రంగా గుర్తిపు కోసం తపిస్తూ ఉంటుంది. ఏదో ఒక విధంగా సమాజంలో వారికీ గుర్తిపు కావలి. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు విపరీతంగా చదివి గుర్తిపు తెచ్చుకుంటే, కొందరు స్పోర్ట్స్ ద్వారా తెచ్చుకోవాలని ప్రయతింస్తారు. కొందరు ఇతరులతో గొడవలు పెట్టుకోవటం ద్వారా గుర్తింపు తెచ్చుకుంటారు. మరికొందరు వారి బ్యాక్ బెంచీలలో కూర్చొని అల్లరి చె |
| టీనేజ్ లో శారీరకంగా వచ్చే మార్పుల గురించి చెందే మానసిక ఆందోళనటీనేజ్ లోకి ప్రవేశించిన వెంటనే వారికి మొదట ఎదురయ్యే ఆందోళన వారి శరీర ఆకృతి గురించి. అప్పటివరకు ముద్దుగా, చిన్న పిల్లల మాదిరి ఉన్న శరీరం క్రమంగా తన ఆకృతిని మార్చుకుంటూ ఉంటుంది. మార్పులు సరయిన సమయంలో సరయిన విదంగా లేనట్లయితే వీరు విపరీతమయిన ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది. మొహంలో వచ్చే మార్పుల గురించి ఆందోళన ఈ వయస్సులో పిల్లలు ఎక్కువ సమయం అద్దం ముందు గడుప |
| ఫేస్బుక్ అడిక్షన్ఎందుకు యువత సోషల్ మీడియాకి బానిసగా మారుతుంది. తన కెరీర్, కొన్నిసార్లు జీవితాలను ఫణంగా పెట్టి కూడా సోషల్ మీడియా మీదనే సమయం వెచ్చించడానికి కారణం ఏంటి? బ్లూ వే |
| టీనేజ్ లో శరీకంగా వచ్చే మార్పుల గురించి చెందే మానసిక ఆందోళనటీనేజ్ లోకి ప్రవేశించిన వెంటనే వారికి మొదట ఎదురయ్యే ఆందోళన వారి శరీర ఆకృతి గురించి. అప్పటివరకు ముద్దుగా, చిన్న పిల్లల మాదిరి ఉన్న శరీరం క్రమంగా తన ఆకృతిని మ |