తెగని మానవ సంబంధాల వేధిక నా తెలంగాణ

తెగని

సరిగ్గా సంవత్సరం క్రితం ఒక స్నేహితుడి చెల్లి పెండ్లి సంబంధం గురించి కూకట్ పల్లి లో ఒక మ్యారేజ్ బ్యూరోకు నేను, నా స్నేహితుడు కలసి వెళ్ళాము. సైకాలజిస్ట్ అవ్వటం వలన ఎక్కడకు వెళ్ళిన అక్కడి మనుషుల ప్రవర్తనను నిశితంగా గమనించడం నా జీవితంలో భాగం అయిపోయింది. ఓ పెద్ద వయస్కుడు మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నాడు. అతను అమ్మాయి (పెండ్లి కూతురు) ఫోటో మరియూ బయోడేట తీసుకొని, ఎంతవరకు ఇస్తారు అని అడిగాడు. నా స్నేహితుడు నసుగుతూ 5 లక్షల వరకు ఇస్తాము సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ పెద్ద మనిషి ʹఛీʹ అని అన్నాడు. అతిశయోక్తి కాదు. ఆ పెద్దమనిషి ఆ సందర్భంగా ఆ పదం వాడటం జరిగింది. బహుశా రేటు పెంచటం కోసం వేసిన ఎత్తు ఏమో! 5 లక్షలు అసలు కట్నమే కాదు అన్నట్లు మాట్లాడి, దానికి తగ్గ సంబంధం చూస్తాను అన్నట్లు చెప్పాడు. నా స్నేహితుడు పిల్ల గుణగణాల గురించి, మంచి కుటుంబం అని, ఇలా చెప్పుకు పోతున్నాడు. పెద్ద మనిషి అవేమి పట్టించుకోకుండా, మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడు. చివరకు ʹఓడిపోయముʹ అన్న మొహం వేసుకుని బయటకు వచ్చాము.

ఆ తరువాత ఒక నెల రోజులకు నా స్నేహితుడి తండ్రి చనిపోతే అతనితో పాటు తోడుగా నూజివీడు అనే ఊరు వెళ్ళాను. అక్కడ అందరూ దుఃఖంలో ఉన్నారు. మర్నాడు అంత్య క్రియలు పూర్తయ్యాయి. ఆ తరువాతి రోజునుండి అతని బంధువులు, స్నేహితులు, ఊరివాళ్ళు వచ్చి పరామర్శించడం మొదలయ్యింది. వచ్చిన వారు మొదట మూడు, నాలుగు వాక్యాలు చనిపోయిన అతని తండ్రి గురించి, అతని గొప్పదనం గురించి చెప్పి, తదుపరి వారు నా స్నేహితుడిని అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో ఏమి చేస్తున్నావు? ఎంత వస్తుంది? ఇద్దరు (అతను, అతని భార్య) జాబ్ చేస్తున్నరా? హైదరాబాద్ లో ఇల్లు కొన్నవా? వంటివి. మరి కొందరు ఓ ఉచిత సలహా కూడా పడేశారు. సంపాదించేటపుడే దాచుకోవాలి అని.

మరి కొంత కాలానికి నా స్నేహితుడి చెల్లికి ఒక సంబంధం వచ్చిందని ఆ మ్యారేజ్ బ్యూరో అతను ఫోన్ చేస్తే వారిని ఒక హోటల్ లో కలిసాము. పెండ్లి కొడుకు తండ్రి పిల్ల గుణగణాల గురించి ఒక్క ముక్క కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. కేవలం పిల్ల చదువు, ఆ చదువు పూర్తయితే వచ్చే ఉద్యోగం, ఆ ఉద్యోగంతో వచ్చే జీతం వీటి గురించే దాదాపు గంటన్నర సేపు ఆరా తీసాడు.

తరువాతి వేసవిలో అదృష్టం బాగుండి నా స్నేహితుడి చెల్లికి ఒక సంబంధం కుదిరింది. హైదరాబాద్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో పెండ్లి చేసాడు. అది ఎంతో సంతోషకరమయిన వాతావరణం. అందరి మొహాల్లో సంతోషం (బయటకు) వెళ్లివిరుస్తుంది. నేను నిశితంగా వారి చూపులను, ముఖ కవళికలను గమనించ సాగాను. దాదాపు అందరు కూడా ఒకరిని ఒకరు వారు వచ్చిన కార్లను, వేసుకున్న నగలను, బట్టలను మరియూ సెల్ ఫోన్లను ఎదుటి వారితో పోల్చుకుంటున్నారు. తాము ఎక్కడ వెనుకబడి పోతామో అని పోటీ పడి ప్రదర్శిస్తున్నారు. తమ కాస్ట్లీ సెల్ ఫోన్లో ఫోటోలు తీసి వాటికి ఉన్న గొప్ప ఫీచర్స్ గురించి చెబుతున్నారు. మధ్యమధ్యలో తాము, తమ కుటుంబ సభ్యలు వేసుకున్న నగలు సరిగా ఉన్నాయో, లేదా ఎక్కడన్నా పడిపోయయో అని సర్దుకుంటున్నారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు అవసరం ఉన్న, లేకున్నా వారి కార్, కొత్తగా కొన్న ఇంటి ప్రస్తావన తెచ్చి వాటి గురించి చెబుతున్నారు. ఎదుటి వారు మేము తక్కువ తిన్నామా అని వారు కొత్తగా కొన్న నగల గురించో, లేదా స్థలం గురించో వివరిస్తున్నారు. గజం ఎంత? కాసు (8 గ్రాములు) ఎంత? తరుగు ఎంత? ఇటువంటి శబ్దాలు ఎక్కువగా వినిపించ సాగాయి.

మరికొందరయితే వారి పిల్లలు ఎవరయినా అమెరికా వెళితే, వారి గురించి, వారి సంపాదన, జీవన విధానం(?) గురించి, వారికి అక్కడ పుట్టిన పిల్లలు, వారికి తెలుగు రాక పోవటం గురించి గొప్పగా చెబుతున్నారు. ఇంకొందరు, అమెరికాకు మిస్సుడ్ కాల్ ఇచ్చి, తిరిగి అమెరికానుంచి వచ్చిన ఫోనులో ఇక్కడ ఉన్న వారితో మాట్లాడిస్తున్నారు. కొందరు పెండ్లి కూతురికి లేదా పెండ్లి కొడుకుకి విషెస్ చెప్పిస్తున్నారు.

సంభాషణలలో అధిక భాగం ఎదుటి వారి రాబడిని గురించిన ఆరా, అలాగే తాము ఆర్థికంగా ఎంత స్థిర పడ్డామో వ్యక్త పరుస్తున్నారు. మరి కొందరయితే ఈ పెండ్లిలో ఇచ్చే కట్నకానుకల గురించి, పెట్టి పోతల గురించి ఆరా తీస్తున్నారు. పెండ్లి కొడుకు సంపాదన, ఆస్తి వివరాలు, పెండ్లి కూతిరి జాబ్, ఆమె తల్లిదండ్రుల ఆస్తి వివరాలు, వారసులు, తదనంతరం ఎవరికీ చెందుతాయి. తల్లిదండ్రులను ఎవరు చూడాలి, ఇంకా ఎవరయినా ముసలి వాళ్ళు మిగిలి ఉంటే వారి భాద్యత, వారి దగ్గర ఏమయినా ఉంటే అది ఎవరికీ చెందుతుంది, మొదలయిన వాటిని బాగా విశ్లేషించి, చివరికి ఈడు,జోడు చక్కగా ఉంది (ఆర్ధిక స్థితిని పోల్చి) అంటున్నారు.

పెండ్లి ఆర్భాటంగా ముగిశింది. అందరు తమ ఐశ్వర్యాన్ని వీలయినంతగా ప్రదర్శించి, గెలిచినట్లు తృప్తిగా తమ తమ ఇండ్లకు పోయి విశ్రాంతి తీసుకున్నారు. కాని రెండు నెలల తరువాత అదనపు కట్నం కోసం పిల్లను, భర్త పుట్టింట్లో వదిలేసి వెళ్ళిన సంగతి ఎవరూ పట్టించుకోలేదు.

ఎందుకు ఇలా మానవ సంబందాలు తయారయ్యాయి? ఇద్దరు మనుషుల మధ్య కేవలం పోటీ తప్ప మరేమీ లేదా? పోటీ అనేది ప్రతీ వ్యక్తినీ మిగిలిన వారితో ఒక విధమయిన శత్రుత్వం పెంచుతుంది అని ఎందుకు గ్రహించటం లేదు? మానవ సంబందాలన్నీ ఆర్థిక సంబందాలేనా?

మానవ సంబంధాలు వేరు ఆర్ధిక సంబంధాలు వేరు. ఇద్దరు వ్యాపారస్తుల మధ్య, రెండు దేశాల మధ్య ఆర్ధిక సంబంధాలు ఉంటాయి. వారి మధ్య మానవ సంబంధాలు ఉండే అవకాశం తక్కువ. వ్యక్తుల మధ్య ఉండ వలసినవి మానవ సంబంధాలు. ఎలాగయితే పాలలో నీళ్ళ శాతం పెరిగితే పాల శాతం తగ్గినట్లు, ఎక్కడయితే ఆర్ధిక సంబంధాలు ఉంటాయో అక్కడ మానవ సంబధాలు కనుమరుగు అవుతాయి.

బ్రిటీష్ వారు వ్యాపారం కోసం మన దేశానికి వచ్చారు. ఆ క్రమంలో వారు మన దేశం వారి అధీనంలోకి వెళ్ళింది. వారికి లాభం ముఖ్యం తప్ప ఇక్కడి మనుషుల సంక్షేమం కాదు. (పెట్టుబడి దారుడు చేసే సంక్షేమ కార్యక్రమాల ముసుగులో వారి లాభాపేక్ష ఉంటుంది అనేది మరువ రాదు.) 200 సంవత్సరాలకు పైగా వారి పరిపాలనలో భారత దేశం ఉండటం వలన భారతీయల జీవన విధానం పైన వారి ప్రభావం పడింది. వారినుంచి భారతీయులు ఆర్ధిక సంబంధాలు పెట్టుకోవడం నేర్చుకున్నారు. ప్రతీ విషయంలో లాభనష్టాలను భేరీజు వేసుకోవటం అలవాటయిపోయింది. బ్రిటీష్ వారి ప్రభావం తక్కువగా ఉన్న ప్ర్రాంతం ఏదయినా ఉన్నది అంటే అది నిస్సందేహంగా నైజం ప్రాంతం. ఇంకా ఈ ప్రాంతంలో స్వచ్చమయిన మానవ సంబంధాలు మిగిలిఉన్నాయి. పట్టణాలు, నగరాలు కొంత వరకు కలుషితమయినా, తెలంగాణా పల్లెలు మాత్రం ఇప్పటికీ స్వచ్చంగా ఉన్నాయి. తెలంగాణా మాండలికం, సంస్కృతి, సంప్రదాయాలు మానవ సంబంధాలను పెంపొందిచుకునే విధంగా ఉండటం విశేషం. ఇక్కడ మనుషులకు డబ్బు, డాబు, దర్పం, భాష వీటన్నిటికన్నా మనిషి జీవితం, మానసిక సంతృప్తి ముఖ్యం. అందువలననే ఇక్కడ నిరుపేద, ధనికుడు కలసి స్నేహం చెయ్యగలుగుతున్నారు.

తెలంగాణ కమ్యునికేషన్ లో భాష కన్నా ఎదుటి వ్యక్తి భావానికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇక్కడి వ్యక్తులు భాష, యాసల గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఎవరయినా తమ యాసను అవహేళన చేసిన ఇక్కడి ప్రజలు పట్టించుకోరు. బోనాలు, బతుకమ్మలు, జానపదాలు, ఒగ్గు కథలు ఇలా ఒక్కటేంటి తెలంగాణా సంస్కృతి అంతా కూడా ఆర్ధిక, సామాజిక స్థితి గతులను మరచి ఒక మనిషి మరో మనిషితో ఆనందంగా గడిపేవిధంగా ఉంటాయి.

తెలంగాణాలో ప్రకృతి ఇప్పటికీ సజీవంగా ఉంది. మైదానప్రాంతంలో లాగా కాకుండా ఇక్కడ కొండలు, గుట్టలు, వాగులు, అడవులు, నదులు ఇవన్ని కూడా ఇక్కడి మనిషిని ప్రకృతి పరంగా జీవించడానికి దోహదహం చేస్తున్నాయి. ఇక్కడి మనుషులకు ఆర్థక లాభాలకన్న సాటి మనిషి, సాటి జీవులతో సంతోషంగా జీవించడం ముఖ్యం. ఇప్పుడు అందరూ అంటున్న ప్రకృతిని ధ్వంసం చేసే సేవ రంగాల (ఏ విధమయిన ఉత్పత్తి లేని రంగాల) అభివృద్ది ఇక్కడ తక్కువ జరిగింది. ప్రకృతిని, మానవ సంబంధాలను ధ్వంసం చేసే అభివృద్ధిని పాలకులు, అధిక శాతం ప్రజలు అభివృద్ధి అనుకోవటం దురదృష్టకరం.

ఇక్కడకు వలస వచ్చిన కొందరిలో లాభాపేక్ష మాత్రమే ప్రధాన ధ్యేయంగా ఉండటం, ఇక్కడి ప్రజలు మానవ సంబంధాలకోసం ప్రాకులాడటం వలన సహజంగా వ్యాపారస్తులు ఆర్ధిక విజయం సాధించారు. తెలంగాణా ప్రజలు భంగ పడ్డారు. ఇది సహజం. వ్యాపారస్తులు వ్యాపారం చేస్తారు. వారి లాభాలకోసం ఏమయినా చెయ్యటానికి వెనుకాడరు. అందులో భాగంగా ప్రేమ నటిస్తారు. గౌరవం, మర్యాద నటిస్తారు. అది వారి వ్యాపారంలో భాగం. అంతేతప్ప అది నిజం కాదు. భారతీయులు బ్రిటిష్ వారి చేతిలో అలాగే భంగ పడ్డారు. ఇప్పతికీ బ్రిటీష్ వారి భాషలో మర్యాద పూర్వకమయిన పదాలు ఎక్కువ వాడతారు. దానికి కారణం వ్యాపారస్తుల భాషలో మర్యాద ఎక్కువగా ఉంటుంది. కాని మానవ సంబంధాలకోసం ఉన్న భాషలో మర్యాద కన్నా ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తెలంగాణా భాషలో నువ్వు అనే శబ్దము మీరు కన్నా ఎక్కువగా ఉంటుంది. దీనిని ఇతర ప్రాంత వాసులు వీరికి మర్యాద తెలియదు అంటారు. కాని నిజానికి వారికి ప్రేమ తెలియదు.

ఎన్ని సార్లు భంగ పడ్డప్పటికీ ఈ సమాజం మోసాన్ని ఎదురించాటానికి మోసం నేర్చుకోకుండా, శాంతియుతంగా పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించడం ఇక్కడి ప్రజల మానవ సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో తెలియచేస్తుంది. పట్టణాలలో కొంత వరకు కలుషిత మయిన సంగతి ఒప్పుకోక తప్పదు. కాని గత 12 సంవత్సారాల పోరాటంలో తిరిగి మానవ సంబందాలకు ప్రాముఖ్యత నివ్వటం జరుగుతుంది.

మనిషి తాను ఆర్ధిక సంబంధాలను పెట్టుకున్నత కాలం వ్యాపారం చెయ్యగలడు కాని జీవితాన్ని అనుభవించలేడు. జీవితమంటేనే మానవ సంబందాలు, సమాజం, అందరి సంతోషం. అందుకే నా తెలంగాణ తెగని మానవ సంబందాల వేదిక.

హరి రాఘవ్ (సైకాలజిస్ట్) 9246 165 165

This article was written on 9th December 2013

Photo courtesy: Award PT- DANCE WITH DRUMS by Mr. Patan Hussain Khan, Khammam

Keywords : telanganga, human relations
(02.05.2018 09:10:42am)

No. of visitors : 2355

Suggested Posts


3 results found !


లాభాలు లేకుంటే స్కూళ్ళు పెడతరా?

ప్రైవేట్ స్కూళ్లలో ఇప్పుడు వసులుచేస్తున్న ఫీజులు తక్కువనే ఉన్నా యన్నట్లు ప్రతి సంవత్సరం 10%పెంచుకోవచ్చని తిరుపతిరావు కమిటీ తేల్చిన నివేదిక నిర్వాకం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయ్యింది.ఫీజులు తగ్గించడం కొరకే ఈ కమిటీని ప్రభుత్వం వేసిందని ఫీజులు తగ్గబోతున్నాయని అవి చెల్లించడానికి కష్టపడుతున్న కుటుంబాలు వీరి నివేదిక వచ్చేవరకు ఆశతో ఎదురుచుస్తూ ఉన్నాయి.ఫీజ

ఆదివాసి.. లంబాడా వివాదం ‍-ఎం.రత్నమాల

ఆదిలాబాద్‌ (పాత) జిల్లాలో ఆదివాసీలు, లంబాడాల మధ్య గత రెండు నెలలుగా సాగుతున్న ఘర్షణ తెలంగాణలోని ఖమ్మం మొదలైన ఏజెన్సీ ప్రాంతాలకే కాదు, ఆదిలాబాద్‌ జిల్లా (పాత) పొరుగున రెండు రాష్ట్రాల సరిహద్దు మహారాష్ట్రలోని ఏజెన్సీ ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నది. 2017 అక్టోబర్‌ 6న జోడెన్‌ఘాట్‌లోని ఆదివాసి మ్యూజియంలో ఉన్న లంబాడా స్త్రీ విగ్రహాన్ని ఆదివాసీలు తగులబ

గొత్తికోయలను మానవ దృక్పధంలో ఆదుకోవాలి

ప్రకృతిలో సరిహద్దు నాగరిక మానవులు గీసుకున్న ఊహాజనిత రేఖలే తప్ప అవి నిజమయినవి కావు. రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులు కేవలం నాగరిక మానవులకు మాత్రమే ఉంటాయి. పక్షులు, జంతువులు, సెలయేర్లు, నదులకు ఎటువంటి సరిహద్దులు ఉండవు. అలాగే ప్రకృతితో సహజీవనం చేస్తున్న ఆదివాసులకు సరిహద్దుల పేరిట విడదీయటం సరికాదు. సెప్టెంబర్ నెలలో భూపాలపల్లి జిల్లాలో గొత్తికోయల మీద పోలీస
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
తెగని